నెల్లూరు జిల్లా, వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈరోజు (గురువారం) తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. అమ్మవారి సేవకులు మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి ప్రాణప్రతిష్ట చేశారు. ఈ ప్రధాన ఘట్టంతో అమ్మలగన్నమ్మ శ్రీ పోలేరమ్మ సమగ్రరూపం దాల్చి భక్తులకు దర్శనమిచ్చింది.
ప్రత్యేక పూల రథంలో నడివీధి శోభాయాత్రగా ముగ్గురమ్మల మూల పుట్టమ్మ ఆలయానికి చేరుకుంది. ఎంతో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా శ్రీపోలేరమ్మ జాతర జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున నడివీధి ఆలయంలో అమ్మవారు కొలువుదీరింది. ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం నుంచి అమ్మవారిని భక్తజనులు దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల తరువాత అమ్మవారి విరూప శోభాయాత్ర జరుగనుంది. అనంతరం అమ్మవారి విరూపంతో శ్రీపోలేరమ్మ జాతర సంపూర్ణం కానుంది.
ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలైంది. అమ్మవారి మెట్టినిల్లు నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పటు చేసిన మండపంలో కొలువుదీరారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అనంతరం సాయంత్రం అమ్మవారికి వైభవంగా నగరోత్సవం నిర్వహించనున్నారు. పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరి నగరంలో సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలంకరణలతో వీధులు కళకళలాడుతున్నాయి. జాతర సందర్భంగా రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వెంకటగిరి వాసులు జాతరకు విచ్చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.