పిఠాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్తలతో కలిసి దర్శించుకుని గోవింద నామస్మరణ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ లడ్డూ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. లడ్డూ ప్రసాదాల విషయంలో కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటూ విరుచుకుపడ్డారు. అవినీతి కన్నా లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదమే కాదు, తమ జిల్లా ఇలవేలుపు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారని ఆరోపించారు.
గత వైసీపీ ట్రస్ట్ బోర్డు.. రైతు డైరీ వద్ద నెయ్యి కొనుగోలు విషయంలో భారీగా అవకతవకలకు పాల్పడ్డారని తెలిపారు. అన్నవరంలో కిలో 538/-, రూ సింహాచలంలో 344/-రూ. నెయ్యిని రైతు డైరీ కంపెనీ సప్లై చేస్తుందన్నారు. రెండు చోట్ల ఒకే కాంట్రాక్టర్ రెండు సంవత్సరాలుగా పాట దక్కించుకుని అన్నవరంలో సంవత్సరానికి 7 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతు డైరీ అనే కంపెనీ ఎక్కడుంది దానికి సరైన లైసెన్సు ఉందా అని ప్రశ్నించారు. అంతస్థాయిలో సప్లై చేసే సామర్థ్యం ఉందా అని అడిగారు. ఒక కిలో నెయ్యి కావాలంటే 20 లీటర్ల పైనే పాలు కావాలి కానీ అంత పెద్ద ఎత్తున నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నల వర్షం కురిపించారు. రోడ్లపై తిరిగే వారు అమ్మితే అన్నవరం ట్రస్ట్ బోర్డ్ ఎలా కొనుగోలు చేసిందని నిలదీశారు. తిరుపతి లడ్డూ ప్రసాదంపై ఏ విధంగా ఎంక్వయిరీ చేశారో ఆ విధంగానే అన్నవరం సత్యనారాయణ స్వామి పవిత్రతను కూడా కాపాడే విధంగా విచారణ జరిపించాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్యే వర్మ స్పష్టం చేశారు.