నీటి ప్రవాహంలో ఓ వ్యక్తి రీల్స్ తీస్తున్న క్రమంలో జారిపడి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... విజయనగరం జిల్లా, గంట్యాడకు చెందిన రాళ్లపూడి పవన్(16) ప్రభుత్వం జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం సేహ్నితులతో కలిసి బుడతనాపల్లి సమీపంలో ఉన్న తమురు గెడ్డ వద్దకు వెళ్లాడు. నీటి ప్రవాహం వద్ద పవన్ రీల్స్ తీస్తున్న క్రమంలో కాలుజారీ పడి గెడ్డలో పడిపోయాడు. వెంటనే సేహ్నితులు రక్షించే ప్రయత్నం చేయగా గెడ్డలో కొంత దూరం వెళ్లిపోయాడు.ఈ విషయంను తెలుసుకున్న ఎస్ఐ సాయి కృష్ణ, తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డి సంఘటనా స్థలం వద్దకు చేరుకుని పరిస్ధితిని పరిశీలించారు.
పవన్ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో గంట్యాడ ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు వచ్చి గెడ్డలో దిగి గాలించారు. చివరకు ఓ ప్రాంతంలో పవన్ మృత దేహం లభ్యం కావడంతో ఒడ్డుకు తీసుకుని వచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయి కృష్ణ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.