విజయనగరం జిల్లా, ఖరాసవలసలో ఈనెల 20న నమోదైన ఖరాసమ్మ అనుమానస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. భర్తే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు బుధవారం సాలూరు సీఐ పి.రామకృష్ణ విలేకరులతో మాట్లాడా రు. సీఐ కథనం మేరకు.. ఖరాసవలసలో ఖరాసమ్మ మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భర్త బొడ్డుదొర శ్రీనును విచారించగా చున్నీని గొంతుకు బిగించి హత్య చేసినట్లు అంగీకరించాడు.
శ్రీను, ఖరాసమ్మ 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే శ్రీను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సైతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్యను తన ఇంటి పక్కనే మరో ఇంట్లో కాపురం పెట్టాడు. ఇద్దరి భార్యలు పక్కనే పక్కనే ఉండడంతో ఖరాసమ్మ,శ్రీనుల మధ్య తరచు గొడవలు జరిగేవి. ఖరాసమ్మ పొలం నుంచి వచ్చి రెండో భార్య వద్దకు వెళ్లవద్దంటు శ్రీనుతో గొడవ పడింది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న చున్నీతో మొదటి భార్య ఖరాసమ్మను గొంతుకు బిగించి చంపివేసి పారిపోయాడు. ఇంట్లో పడి ఉన్న కోడలును అత్తమామలు సాలూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయాలను వివరి స్తూ వీఆర్వో సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు. ఈ మేరకు నిందితుని అరెస్ట్ చేశారు.