మధ్యతరగతి కుటుంబం.. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం. బీటెక్ పూర్తి చేసిన తర్వాత.. ఆమెకు పంచాయతీ కార్యదర్శిగా కార్యదర్శిగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయినా సరే ఆమె అక్కడితో ఆగలేదు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్న సక్సెస్ స్టోరీ. ఆమె తన శిక్షణను పూర్తి చేసుకుని ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం టంగుటూరుకు చెందిన కంబాలకుంట లక్ష్మీ ప్రసన్నది మధ్యతరగతి కుటుంబం. ఆమె స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి, తిరుపతిలోని చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. అనంతరం రాజంపేటలో ఉన్న అన్నమాచార్య ఇంజినీరింగ్ కాలేీలో బీటెక్ పూర్తిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడి చదివి.. ముందు పంచాయతీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. లక్ష్మీ ప్రసన్న టీవీపురంలో విధులు కూడా నిర్వహించారు.
అయినా సరే తనకు సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఉంది. అందుకే ఢిల్లీలో శిక్షణ తీసుకుని.. 2018లో నిర్వహించిన గ్రూప్-1లో మెయిన్స్‌కు అర్హత సాధించారు. కానీ ఆమెకు త్రుటిలో అవకాశం చేజారింది.. అయినా అక్కడితో ఆగలేదు, నిరాశ చెందలేదు. తొలి ప్రయత్నంలో జరిగిన లోటుపాట్లను సరిచేసుకుంటూ పట్టుదల పెంచుకుని.. గమ్యం వైపు అడుగులు వేశారు. 2023లో నిర్వహించిన గ్రూప్-1లో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకుతో అనుకున్న సాధించారు. అనంతరం మంగళగిరిలోని హెచ్‌ఆర్‌డీఏలో శిక్షణ పొందుతున్నారు.. ఆమెకు శిక్షణ అక్టోబర్ 4తో అది పూర్తికానుండగా.. ఒంగోలు ఆర్డీవోగా నియమితులయ్యారు. లక్ష్మీ ప్రసన్న భర్త చంద్రదీప్ అనంతపురం జిల్లాలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె త్వరలోనే ఒంగోలు ఆర్డీవోగా బాధత్యలు స్వీకరించబోతున్నారు. లక్ష్మీ ప్రసన్న శిక్షణ పూర్తైన వెంటనే.. ఆమె తొలి పోస్టింగ్ కీలమైన ప్రకాశం జిల్లా ఒంగోలులో రావడం విశేషం. కష్టపడి చదివి అనుకున్నది సాధించి.. జీవితంలో ఉన్నతస్థానంలో ఉన్నారు లక్ష్మీ ప్రసన్న. ఈ యువ డిప్యూటీ కలెక్టర్ సక్సెస్ స్టోరీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది.