జనసేన నుంచి రాజ్యసభ సభ్యుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పేరు వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో చురుకుగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలను నాగబాబు తన భుజాన్న వేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించినప్పటికీ పొత్తుల కారణంగా ఆయనకు అవకాశం దక్కనప్పటికీ నిరుత్సాహ పడలేదు. కూటమి గెలుపు కోసం కష్టపడ్డారు. దీంతో జనసేన నుంచి రాజ్యసభ రేసులో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగబాబును రాజ్యసభ్యుడిగా ప్రతిపాదిస్తే పార్టీలో వ్యతిరేకత ఉండకపోవచ్చు. నామినేటెడ్ పదవులకంటే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే నాగబాబుకు సరైన గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జనసేన అధ్యక్షులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.