తిరుమల లడ్డూ కల్తీ, కేసు సిట్ ఏర్పాటుపై మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కుళ్లిపోయిన జంతు కొవ్వు నార్త్ ఇండియాలో ఎక్కువ దొరుకుతుందని, విదేశాలకు సోపు సరఫరా చేయాలంటే కూడా జంతు కొవ్వు కలపలేదని డిక్లరేషన్ ఇవ్వాలని.. విదేశీ వినియోగదారులకు సోపు పంపాలంటే ఇన్ని ఆంక్షలు ఉంటాయని అన్నారు. అలాంటపుడు నెయ్యిలో కల్తీ కాకుండా ఎంత కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి.. వనస్పతి అంటే కూడా రైస్ ఆయిల్, జంతువుల ఆయిల్ కూడా కలుస్తుందన్నారు.
కేసు పెట్టాలంటే... కల్తీ జరిగిదంటే చాలు.. జంతు కొవ్వు ఉందా లేదా అనేది అనవసరం. కల్తీ జరిగిందనేది నిజం... మరో ఆలోచన లేదని.. నెయ్యి ప్యూర్‌గా లేకుండా ఏది కలిపినా కల్తీ అయినట్టేనని.. శిక్ష ఒక్కటే అని వెంకటేష్ అన్నారు. హత్య చేసేపుడు కత్తి అయినా, తుపాకి అయినా ఒక్కటేనని, దేనితో చంపారనే దాన్ని బట్టి శిక్ష ఉండదని.. హత్య హత్యే అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కల్తీ అయ్యింది. కేసు పెట్టేరు.. ఇక వేరే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెడితే మంచిదని అన్నారు. సీఎం ఎప్పుడూ విద్యార్థిగానే ఉండాలని.. లడ్డూ క్వాలిటీ బాగలేదని భక్తులు ఎన్నో సార్లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారని టీజీ వెంకటేష్ అన్నారు. రాజులు, వారి పెట్టిన సామంతరాజులు సరిగ్గా ఉంటే ఇలాంటివి జరగవని అన్నారు. సిట్‌పై వారికి నమ్మకం లేకపోతే, సీబీఐపైన కూడా వారికి ఉండదని, అందుకే వారు గతంలో వారి కేసుల్లో సీబీఐకి కూడా సహకరించలేదని విమర్శించారు. టీటీడీ పాలకమండలికి తనలాంటి వారు అనర్హులని.. ఆలయానికి పాలకమండలి ఛైర్మన్ వంటి వాటికి హనుమూన్ లా అలా వచ్చి ఇలా వెళ్లటం సరికాదన్నారు. అక్కడే ఉండి ఆలయపాలన చూడాలని పేర్కొన్నారు. కాగా హైడ్రా బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని, అసైన్డ్ భూములను అమ్మిన వారు, వాటిని రిజిస్త్రేషన్ చేసిన రిజిస్టర్, రెవిన్యూ అధికారులు అందరిపైన చర్యలు తీసుకోవాలని వెంకటేష్ సూచించారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ విచారణ కోసం ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తిరుపతికి చేరుకుంది. సిట్ అధిపతి, ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతికి చేరుకున్నారు. వందే భారత్ రైలులో ఇద్దరు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, ఉమా మహేశ్వర్ (విజయవాడ), సూర్యనారాయణలు సీఐ సత్యనారాయణ (అన్నమయ్య జిల్లా) తిరుపతికి చేరుకున్నారు. సిట్‌లో సభ్యుడు తిరుపతి అడ్మిన్ ఎఎస్పీ వెంకటరావు స్థానికంగా ఉంటూ విచారణకు సహకరించనున్నారు. ముందుగా పోలీసు గెస్టు హౌస్‌కు చేరుకున్న సిట్ బృందం.. ఆపై తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమలకు వెళ్లి టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోలని సిట్ బృందం కలువనుంది. ఆపై తిరుమలలో శ్రీవారిని సిట్ బృందం సభ్యులు దర్శించుకోనున్నారు. ఆ తరువాత తిరుమల అన్నమయ్య భవన్ సిట్ సమావేశం కానుంది.