జగన్‌పై మంత్రి గొట్టపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంప్రదాయాలు పాటించకపోగా వాటిని కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్‌ను వెంటనే దేశ బహిష్కరణ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామో అంటూ చేసిన వ్యాఖ్యలు తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఏ మతానికైనా కొన్ని సిద్ధాంతాలుంటాయని.. వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడవవుతావన్నారు. మత విశ్వాసాలు, దేశ సంప్రదాయాలను కించపరుస్తూ.. జగన్ రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం బాధాకరమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలతో అత్యున్నత పదవులు పొంది, వాటిని అడ్డం పెట్టుకుని దేశ సంపదను కొల్లగొట్టారని ఆరోపించారు.
ఇప్పుడు అదే దేశంలో ఉంటూ దేశ సంప్రదాయాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన పాటించాల్సిందేనని తేల్చిచెప్పేసరికి... ఏకంగా దేశాన్ని, మత సామరస్యాలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశమన్నా... దేశ సంప్రదాయాలన్నా ఏమాత్రం గౌరవం లేదనే తన నైజాన్ని జగన్ బయటపెట్టుకున్నారన్నారు. దేశాన్ని, దేశ సంప్రదాయాలను కించపరిచుస్తూ... భారతదేశంలో మాత్రం జగన్ ఎందుకుండాలని మంత్రి రవికుమార్ ప్రశ్నించారు.