దసరా శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా పీటీడీ విజయనగరం జోన్ లోని 19 డిపోల నుంచి 300 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు జోన్ ఇన్‌చార్జి ఈడీ అప్పలనాయుడు చెప్పారు. సోమవారం ఆయన అనకాపల్లి డిపోను సందర్శించారు. కార్గో సర్వీసులను పరిశీలించి కలాసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు దసరా ప్రత్యేక సర్వీసులు నడపనున్నామన్నారు.
జోన్ పరిధిలో పార్శిల్ ఆదాయం బాగుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.12 కోట్లు ఆదాయం లభించిందని, మార్చి చివరినాటికి రూ.24 కోట్లు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పార్శిల్ రవాణాలో రాష్ట్రంలో విజయనగరం జోన్ ముందంజలో ఉందని వివరించారు. బైపాప్ మీదుగా వెళుతున్న వివిధ ప్రాంతాల ఎక్స్‌ప్రెస్ బస్సు సర్వీసులను అనకాపల్లి కాంప్లెక్స్‌కు వచ్చేలా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.