తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన.. దీక్షను విరమించారు. శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయనకు గొల్ల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. జనసేనానికి టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, పవన్ తన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొనడం జరిగింది. స్వామివారి దర్శనానంతరం డిప్యూటీ సీఎం తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. ఇక శ్రీవారి దర్శనం తర్వాత బయటకు వచ్చిన పవన్ చేతిలో వారాహి డిక్లరేషన్ బుక్ కనిపించింది. దర్శనానికి వెళ్లిన సమయంలో తన వెంట ఈ డిక్లరేషన్ పుస్తకం తీసుకెళ్లారు.