ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్ ఛార్జీలు కూడా ఎత్తేస్తామని నాడు బీరాలు పోయిన బాబు.. తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఇప్పుడు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్బంగా.. చంద్రబాబు ఎన్నికల ప్రచార హామీ.. ఇప్పటి ప్రకటన వీడియోలను కాకాణి మీడియా ముందు ప్రదర్శించారు.
చంద్రబాబు తరహాలో మరే నేత ఇంతలా మాట మార్చి ప్రజలను మోసం చేయలేరని కాకాణి అభిప్రాయపడ్డారు. కూరగాయలతో పాటు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతుంటే, మరోవైపు విద్యుత్ ఛార్జీల వడ్డన సరికాదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలపై అదేపనిగా విరుచుకుపడిన ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసిందని గుర్తు చేసిన మాజీ మంత్రి, హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని తేల్చి చెప్పారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు సిద్ధమైన చంద్రబాబు, ప్రజలకు వంద రోజుల పాలన కానుక ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆక్షేపించారు.