పోలవరం పనుల్లో చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే ప్రాజెక్టు పనులన్నీ అస్తవ్యస్తం అయ్యాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ రెండు నివేదికల్లో స్పష్టం చేసిందని మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు. దీనికి చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని, ఎప్పటికైనా ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీ స్పష్టం చేశారు.
20 నుంచి 40 మీటర్ల మేర కాఫర్‌డ్యామ్ కింద జెట్ గ్రౌటింగ్ వాల్ కట్టి, ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మించాల్సి ఉండగా, చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారని, అలా నిబంధనలకు మంగళం పాడడమే కాకుండా, సాంకేతికపరమైన అంశాలకు పాతర వేయడం వల్లనే పోలవరం ప్రాజెక్టు పనులు అస్తవ్యస్తమయ్యాయని మార్గాని భరత్ తెలిపారు. పోలవరం పనుల్లో తప్పిదాలన్నీ చేసిన చంద్రబాబు, నిస్సిగ్గుగా జగన్‌గారిపై నిందలు మోపుతున్నారని ఆగ్రహించారు. గత ప్రభుత్వ హయాంలోనే పోలవరం స్పిల్‌వే పూర్తి చేయడంతో పాటు, హైడ్రాలిక్ గేట్స్ కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.
ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు మాట్లాడాలన్న మాజీ ఎంపీ, ఏ కమిటీ, ఏ నిపుణుడు సిఫార్సు చేస్తే కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, డయాఫ్రమ్‌వాల్ ఎందుకు కట్టారో చెప్పాలని కోరారు. చంద్రబాబు నిర్వాకం వల్లే డయాఫ్రమ్‌వాల్ కొట్టుకుపోయిందని, ఫలితంగా వందల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, వచ్చే నెల అంటే నవంబరులో డయాఫ్రమ్ వాల్ పనులు మొదలుపెడితే, ఏప్రిల్ 2025లో రుతుపవనాలు వచ్చేలోగా పూర్తి చేయాల్సి ఉందని మార్గాని భరత్ వివరించారు.