ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గురువారం అమ్మవారికి అర్చకులు స్నాపనాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు. అమ్మవారి దర్శనం కోసం గురువారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి వినాయకుని గుడి వద్ద నుండి క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకోక అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తారు. తొలి రోజు గురువారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తారు.
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్బంగా ఇంద్రకీలాద్రిని విద్యుత్ దీపాలతో మిరిమిట్లు గొలిపేలా అలంకరించారు. 9 గంటలకు అమ్మవారు భక్తులకు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. దసరా మహోత్సవాల నిర్వహణకు మొత్తం 6వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి ప్రాశస్త్యం తెలియజేసేలా లేజర్ షోను ఏర్పాటు చేస్తున్నారు. దుర్గా ఘాట్ వద్ద నవ హారతులను ప్రారంభించారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో ఈ హారతులు ప్రత్యేక ఆకర్షణగా ఉండనున్నాయి. ఈసారి ఉత్సవాల్లో పోలీసులు సరికొత్త ప్రయోగం చేయనున్నారు. సైబర్ నేరాలు.. రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ నేరాల నుంచి ఎలా తప్పించుకోవచ్చు అనే అంశాలను కూడా వివరించనున్నారు. 10 రోజులపాటు జరిగే మహోత్సవాలకు సుమారు 13 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.