ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి శాసనాన్ని చారిత్రక పరిశోధకుడు తురిమెళ్ల శ్రీనివాసప్రసాద్ గుర్తించారు. త్రిపురాంతకం ఆలయ ప్రాంగణంలోని గణపతి మండపం ఎదురుగా ఉన్న నంది స్తంభంపై ఈ శాసనం చెక్కి ఉంది. దీని ప్రకారం భిక్షవృత్తి అయ్యంగార్లు స్వామివార్లకు చేయించిన బంగారు ఆభరణాలకు గుర్తుగా స్తంభశాసనాన్ని ఏర్పాటు చేసినట్లుగా ఉంది. వీరశైవులు అనేకులు భిక్షావృత్తిలో జీవించేవారని, వీరినే భిక్షవృత్తి అయ్యం గార్లు అంటారని శ్రీనివాసప్రసాద్ తెలిపారు. వారికి భూములు, ఆస్తులు ఉన్నా భిక్షాటన చేసి ఆలయాల పునరుద్ధరణ, నిర్వహణ చేసేవారన్నారు. 14వ శతాబ్దంలో త్రిపురాంతకేశ్వరాలయం భిక్షవృత్తి అయ్యంగార్ల ఆధీనంలో ఉన్నదన్న విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తు న్నదన్నారు. ఆలయంలో ధూపదీప నైవేద్యాలు వారే నిర్వహించేవారని, వారిలో శిద్దయ దేవయ్య ప్రముఖులని తెలిపారు.