జగన్ ప్రభుత్వంలో ఇసుక, గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతికి అప్పటి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపణలు చేశారు. ఇవాళ(శుక్రవారం) నెల్లూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ... సూరాయపాలెంలో రూ. 54 కోట్లు, విరువూరులో రూ. 37 కోట్లు పెనాల్టీని మైన్స్ శాఖ వేసిందని గుర్తుచేశారు. రైతుల పేరుతో అనుమతులు తెచ్చి గ్రావెల్‌ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని ఆరోపించారు.
అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన దోపిడీదారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు.. మైనింగ్ అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు... ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. కరోనా హౌస్‌లో కూర్చుని సర్వేపల్లిని దోచుకున్న వ్యక్తి కాకాణి గోవర్ధన్ రెడ్డి అని విమర్శించారు.