శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం’’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు. ‘‘మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగింది. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నాను..!!’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.