ప్రస్తుతమంతా ఆన్‌లైన్ మయం.. సర్వస్వం సెల్‌ఫోన్ మయం.. కట్టే బట్ట నుంచి తినే తిండి వరకూ ఏదీ కావాలన్నా నిమిషాల్లో చేతులో ఉంటుంది. ఇక ఉరుకులు, పరుగులతో కూడిన ఈ గజిబిజి బతుకుల్లో వండటానికి తీరికలేని వారికి జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలే ఆధారం. అయితే ఏపీలో స్విగ్గీకి షాక్ తగిలేలా ఉంది. స్విగ్గీని బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌లోని హోటల్ యజమానులు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ నుంచి స్విగ్గీకి అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రకటించింది. హోటళ్లకు నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతోందని హోటల్ యజమానులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే.. స్విగ్గీకి అమ్కకాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. అందులో భాగంగా అక్టోబర్ 14 నుంచి అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో స్విగ్గీకి అమ్మకాలు ఆపివేయనున్నట్లు
మరోవైపు స్విగ్గీ, జొమాటో కారణంగా తమకు నష్టం జరుగుతోందని ఏపీలోని హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు ఆరోపిస్తున్నారు. క్యాష్ పేమెంట్స్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారని.. దీనిపై ఇప్పటికే రెండు యాజమాన్యాలతో చర్చలు జరిపినట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ చెప్తోంది. ఆగస్ట్ 12, 27, సెప్టెంబర్ 27న ఇలా మూడు దఫాలుగా స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో చర్చలు జరిపామని.. అయితే ఎలాంటి ఉపయోగం లేదని తెలిపింది. జొమాటో యాజమాన్యం సానుకూలంగా స్పందించినప్పటికీ.. స్విగ్గీ మాత్రం కాలయాపన చేస్తోందని ఏపీ హోటల్స్ అసోషియేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు చెందిన హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చించి.. స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మరోవైపు అక్టోబర్ 14వ తేదీ అంటే సుమారుగా పదిరోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో స్విగ్గీ యాజమాన్యం ఏపీ హోటల్స్ అసోసియేషన్‌తో మరోసారి చర్చలు జరుపుతుందేమో చూడాలి. ఒకవేళ చర్చలు జరిగి.. సానుకూల నిర్ణయం వెలువడితే.. ఏపీలో యథావిధిగా స్విగ్గీ సేవలు కొనసాగుతాయి. లేని పక్షంలో అక్టోబర్ 14 నుంచి ఏపీలో స్విగ్గీ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. మరి హోటల్స్ అసోసియేషన్ నిర్ణయంపై స్విగ్గీ యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ చూడాలి మరి.