ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే

national |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 10:34 PM

వందే భారత్ రైళ్ల రాకతో భారతీయ రైల్వే వ్యవస్థలో నూతన ఉత్సాహం నెలకొంది. రైల్వేలను ఆధునికీకరించడం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వందే భారత్, వందే మెట్రో రైళ్లు అందుబాటులోకి రాగా.. త్వరలోనే వందే భారత్ స్లీపర్, బుల్లెట్ రైళ్లు కూడా మన పట్టాలపై పరిగెత్తనున్నాయి. ఈ నేపథ్యంలోనే మరిన్ని ప్రత్యేకతలు ఉన్న హైడ్రోజన్ రైలు కూడా పట్టాలు ఎక్కేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ ప్రారంభం అవుతుందని తాజాగా కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు జర్మనీ, ఫ్రాన్స్, చైనా, స్వీడన్ దేశాల్లో మాత్రమే ఉన్న ఈ హైడ్రోజన్ రైళ్లు.. భారత్‌లో అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే హైడ్రోజన్ రైలు ఉన్న ఐదో దేశంగా భారత్ చేరనుంది.


ఈ క్రమంలోనే జర్మనీకి చెందిన టీయూవీ-ఎస్‌యూడీ సంస్థ.. హైడ్రోజన్ రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ రైలు ట్రయల్ రన్ ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలు కానున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక ఈ హైడ్రోజన్ రైలు ఒక్క యూనిట్ ఖరీదు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రైల్వే అధికారులు మొదట 35 హైడ్రోజన్ రైళ్లను నడపనున్నారు. ఒక్కో రైలుకు సుమారుగా రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీని గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సిద్ధం చేయడానికి రూ.70 కోట్లు ఖర్చు చేయనున్నారు. సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ యూనిట్ బ్యాటరీ, రెండు ఇంధన యూనిట్లను ఇప్పటికే విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.


ఇక ఈ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్-సోనిపట్ సెక్షన్‌లో నడపనున్నట్లు తెలుస్తోంది. హర్యానాలో నడిచే ఈ రైళ్లకు జింద్‌లో ఉన్న 1 ఎండబ్ల్యూ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెమ్బ్రేన్ ఎలక్ట్రోలైజర్ నుంచి హైడ్రోజన్‌ను అందించనున్నారు. అక్కడ నిత్యం దాదాపు 430 కిలోల హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుండగా.. 3 వేల కిలోల హైడ్రోజన్ నిల్వ సామర్థ్యం కూడా ఉంది. ఇక ఈ హైడ్రోజన్ రైలు.. హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తుంది. సాధారణ రైలులో ఉండే ఇంజన్ స్థానంలో ఈ రైలులో హైడ్రోజన్ ఇంధన కణాలు ఉంటాయి. ఈ రైళ్లు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ లేదా పార్టిక్యులేట్ మ్యాటర్ వంటి కాలుష్య కారకాలను విడుదల చేయని కారణంగా.. కాలుష్యం ఉండదు.


హైడ్రోజన్ ఇంధన కణాల సాయంతో.. హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. ఈ హైడ్రోజన్ రైలును హైడ్రైల్ అని కూడా పిలుస్తారు. ఈ రైలులో 4 కోచ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది. నీలగిరి మౌంటైన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్, కల్కా సిమ్లా రైల్వే, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై మరియు మార్వార్ దేవ్‌గర్ మదారియా మార్గాల్లో ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు చేస్తోంది. ఈ రైలు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అయితే డీజిల్ రైలుతో పోలిస్తే ఈ హైడ్రోజన్ రైలును నడిపేందుకు అధిక ఖర్చు అవుతుంది. కిలో గ్రీన్ హైడ్రోజన్ దాదాపు రూ.492 ఉంటుంది. డీజిల్ రైలు కంటే ఈ రైలు నిర్వహణకు 27 శాతం అధిక ఖర్చు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రెంచ్ కంపెనీ తొలిసారిగా హైడ్రోజన్ రైలును సిద్ధం చేసింది. 2018 నుంచి ఫ్రాన్స్‌లో ఈ హైడ్రోజన్ రైలు నడుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com