ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం త్వరలోనే మరో శుభవార్త వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీని ఐఐటీగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. అధికారులు చెప్తున్న ప్రకారం అన్నీ అనుకున్నట్లు సజావుగా సాగితే ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (AUCoET) త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హోదా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే జరిగితే AUCoET త్వరలోనే.. ఐఐటీ వైజాగ్ లేదా ఐఐటీ విశాఖపట్నంగా మారనుంది. ఏపీలో ఇప్పటికే తిరుపతిలో ఓ ఐఐటీ ఉంది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే ఐఐటీ వైజాగ్ రెండోది కానుంది. అలాగే దేశంలోని 24వ ఐటీగా నిలవనుంది.
అయితే 2005లోనే ఈ ప్రతిపాదన వచ్చింది. దేశంలోని ఏడు ఇంజినీరింగ్ కాలేజీలను ఐఐటీలుగా తీర్చిదిద్దాలంటూ ఎస్కే జోషి కమిటీ అప్పట్లో ప్రతిపాదనలు చేసింది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఉంది. అయితే వివిధ కారణాలతో ఈ ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు. అయితే ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీని ఐఐటీగా అప్ గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు ఈ విషయమై. ఆంధ్రా యూనివర్సిటీ మేనేజ్‌మెంట్‌తో చర్చించినట్లు తెలిసింది. ఆంధ్రా యూనివర్సిటీకి ఉన్న చరిత్ర. విశాలమైన క్యాంపస్, విశాఖపట్నం అతిపెద్ద నగరం కావటంతో ఐఐటీ వైజాగ్‌గా మార్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం.. దీనిపై కేంద్రాన్ని కోరాల్సి ఉంది.
ఐఐటీ వైజాగ్‌గా అప్ గ్రేడ్ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరితే.. ఐఐటీ కౌన్సిల్ కమిటీ కూడా ఇందుకు గల సాధ్యాసాధ్యాలను సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఐఐటీ మాత్రమే ఉంది. ఎన్నికలకు ముందు తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాశ్వత భవనాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ శాశ్వత క్యాంపస్‌లను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పుడు అన్నీ కుదిరితే.. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ.. ఐఐటీ వైజాగ్‌గా మారనుంది.