కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూ తయారీలో భాగంగా ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన.. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. సనాతన ధర్మంపై, హిందూ మతంపై, ఆలయాలపై దాడులు జరుగుతున్నాయనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో సనాతన ధర్మంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
వాస్తవానికి లడ్డూ కల్తీ జరిగిందని ఆరోపణలు వచ్చినప్పటి నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్న ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆరోపణలు చేయకుండా.. తప్పు చేసిన వారిని శిక్షించాలని, దీనికి మతం రంగు పులుమకూడదని పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ట్విటర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. "సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం. ఆల్ ది బెస్ట్ #జస్ట్ ఆస్కింగ్" అంటూ తాజాగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. అయితే సనాతన ధర్మంపై నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే ప్రకాష్ రాజ్ ఈ ట్వీట్ చేశారని.. నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ చక్కర్లు కొడుతోంది.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న వార్తలు ప్రారంభం అయినప్పటి నుంచి ప్రకాష్ రాజ్ ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు పెడుతున్నారు. అయితే తాను విదేశాల్లో సినిమా షూటింగ్‌లో ఉన్నానని.. సెప్టెంబర్ 30వ తేదీన వచ్చి అన్నింటికీ సమాధానాలు చెబుతానని పేర్కొన్నా.. ఆయన రాలేదు. కానీ ట్విటర్‌లో మాత్రం వరుసగా సెటైర్లు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తిరుపతి వారాహి సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. వారాహి డిక్లరేషన్‌ను ప్రకటించారు. అంతేకాకుండా తాను సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిని అని.. సనాతన ధర్మానికి ఆపద వస్తే.. తన ప్రాణాలను అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటానని తేల్చి చెప్పారు.
ఇక ఇదే సమయంలో సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని.. అయితే అలాంటి వారిని కోర్టులు, చట్టాలు రక్షిస్తున్నాయని పరోక్షంగా డీఎంకే యువనేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై డీఎంకే తీవ్రంగా మండిపడింది. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు.