జనం అమాయకత్వాన్ని, బలహీనతలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న ఘటనలు దేశంలో నిత్యకృత్యంగా మారిపోయాయి. వీటిపై పోలీసులు, అధికారులు హెచ్చరిస్తున్నా జనాల్లో మాత్రం చైతన్యం రావడం లేదు. మోసగాళ్ల మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకుని.. తర్వాత లబోదిబోమంటున్నారు. తాజాగా, ఓ భార్యభర్తలు టైమ్ మెషీన్‌తో మీ వయసు తగ్గించేస్తామని జనాలను బురిడీ కొట్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయేల్‌కు చెందిన టైమ్ మెషీన్‌తో మీ వయసును వెనక్కి తీసుకెళ్తామని చెబితే.. వేలంవెర్రిగా జనం నమ్మి వారికి కోట్లు సమర్పించుకున్నారు. చివరకు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మోసపోయామని గ్రహించారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన రాజీవ్ కుమార్ దూబే, అతడి భార్య రష్మీ దూబేలు నగరంలో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ థెరపీ సెంటర్ ప్రారంబించారు. ఇజ్రాయేల్ నుంచి తీసుకొచ్చిన టైమ్ మెషీన్‌లతో 60 ఏళ్లు వయసును 25 ఏళ్లకు తగ్గించేస్తామని ప్రచారం చేశారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా పండు ముసలోళ్లు పడుచు యువకలుగా మారిపోతారని నమ్మించారు. గాలిలో కాలుష్యం వల్ల వేగంగా వృద్ధాప్యం వస్తోందని, ‘ఆక్సిజన్ థెరపీ’ వల్ల నెలరోజుల్లోనే మార్పు వస్తుందని చెప్పారు.
‘పది సెషన్‌లకు రూ. 6,000... మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90,000 ప్యాకేజీలను ప్రకటించి భారీ మోసానికి తెరతీశారు’ అని సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ఇలా వీరి చేతుల్లో మోసపోయిన రేణు సింగ్ అనే బాధితురాలు... తన నుంచి రూ. 10.75 లక్షలు కొట్టేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనలాగే వందలాది మంది నుంచి సుమారు రూ. 35 కోట్లు కొల్లగొట్టారని కూడా ఆమె ఆరోపించారు. దీంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి..ఆ దంపతుల కోసం గాలిస్తున్నారు. అయితే, రాజీవ్ దూబే, అతడి భార్య రష్మీ దూబేలు దేశం విడిచి విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. థెరపీ కేంద్రంలో మెషీన్లను నిపుణులను పరిశీలించనున్నట్టు చెప్పారు.