తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేస్తోంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు అక్టోబరు 7న తిరుమలకు చేరుకుంటాయి.
తిరుమల బ్రహ్మోత్సవాలు లో భాగంగా ఈ నెల 8వ తేదీ సాయంత్రం శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విహరిస్తారని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, గోవిందనిలయం నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఈ పాయింట్లలోకి ప్రవేశించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను అక్టోబరు 7వ తేదీ రాత్రి 9 గంటల నుండి అక్టోబరు 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు రద్దు చేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజారవాణాను వినియోగించుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 3 వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
తిరుపతి, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి తాము క్యూఆర్ కోడ్‌లను కూడా అందిస్తున్నామన్నారు. తిరుమలలోని బాలాజీనగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల 9 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు.. వినాయకనగర్ క్వార్టర్స్, నెహ్రూ మున్సిపల్ పార్కు, భారతీయ విద్యాభవన్, దేవలోక్.. అదనంగా శ్రీవారి మెట్టు వద్ద నాలుగు చక్రాల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు.
భక్తులకు వైద్య సేవల కోసం తిరుమల మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లు, 12 అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. గరుడసేవలో వాహనసేవను వీక్షించేందుకు మాడవీధులు, భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రంభగీచా విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో 28 భారీ హెచ్‌డి డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశామన్నారు. గరుడ సేవను పర్యవేక్షించేందుకు 1250 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, 5 వేల మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. అన్నప్రసాదం, తాగు నీరు విస్తృతంగా ఏర్పాటు చేశామని.. శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు, వెలుపలి ప్రదేశాలలో భక్తులకు సేవలు అందిస్తారన్నారు.