రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసినట్లు చెప్పారు. గత పాలకుల చేతిలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి కేంద్ర సాయం అవసరమని, ఇదే మాటను ఎన్నికల సమయంలోనూ చెప్పానని గుర్తు చేశారు. ఒక విధ్వంసకర వ్యక్తి చేతికి అధికారం వస్తే రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలం అవుతుందో ఏపీ ఒక కేస్ స్టడీగా మారిందన్నారు. భావితరాలకు కూడా ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.సమైక్యాంధ్రప్రదేశ్‌లో మనం చేసిన పనుల వల్ల తెలంగాణ బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే ఒక విధ్వంస పాలన వల్లే మనం ఎక్కువ నష్టపోయామన్నారు. ఎవరికి ఓటు వేస్తే సుస్థిరమైన పాలన వస్తుందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. విజన్‌తో సంస్కరణలు తేవచ్చన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమంగా తీసుకెళ్లాలన్నారు. మోదీ మూడో సారి గెలవడమే కాకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలపై దృష్టి పెడితే మరింత మెరుగైన అవకాశాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.వృద్ధుల కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కింద 6 లక్షల మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. మౌలిక సదుపాయాల కోసం రూ. 3 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. ఎయిర్ పోర్టులు, పోర్టులు, రహదారుల నిర్మాణాలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నాయన్నారు. ఒక్క రైల్వే రంగంలోనే ఏపీలో రూ.70 వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారని తెలిపారు. ఉత్తర భారతదేశంలో అహ్మదాబాద్ టూ ముంబాయ్ బుల్లెట్ ట్రైన్ రాబోతోందని, దక్షిణ భారతదేశంలో పెడితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వస్తే 4 కోట్ల మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.గ్రామీణ రహదారుల కోసం కూడా రూ. 62,500 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారన్నారు. 3 కోట్ల మందికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టిస్తున్నారని వెల్లడించారు. కుసుమ్ కింద రైతులకు నేరుగా సోలార్ ఎనర్జీ ఇవ్వడంతో పాటు ఇళ్లకూ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఎన్డీయే కూటమిలో చేరింది రాష్ట్ర అవసరాలతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే అన్నారు. ఇందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 24 గంటలూ ప్రజలకు ఏం చేయాలనేదే ప్రధాని ఆలోచిస్తుంటారని కితాబునిచ్చారు.మెరుగైన అధునాతన టెక్నాలజీని కేంద్రం వినియోగిస్తోందన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా అందరి ప్రొఫైల్స్ రికార్డు మెయింటైన్ చేస్తే దేశవ్యాప్తంగా అందరి ఆరోగ్యాలపై ఒక స్పష్టత వస్తుందన్నారు. ఎక్కడ, ఎవరు ఏ వ్యాధితో ఎక్కువ ఉన్నారో తెలుసుకోవచ్చునని తెలిపారు. అలాగే అపార్ ద్వారా ఒకటో తరగతి పిల్లాడు కాలేజీ నుంచి బయటకు వచ్చే నాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని, ఏం స్కిల్స్ ఇవ్వాలనే దానిపై స్పష్టత వస్తుందన్నారు. గెలుపునకు విశ్లేషణ చేయాలని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగిందంటే వారి కార్యక్రమాలకు ప్రజామోదం ఉన్నట్లేనని తెలిపారు.ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేదని, ఆ తర్వాత ఎలక్ట్రానికి మీడియా... ఆపై సోషల్ మీడియా వచ్చిందన్నారు. ఇప్పుడు అందరూ రాసేవాళ్లేనని, రాజకీయ పార్టీలు వందల ఛానల్స్ పెట్టేస్తున్నాయని... ఒక వార్త నిజమా? కాదా? అని తెలుసుకునే లోపే విషయాలు బయటకు వస్తున్నాయన్నారు.