ఇటీవలి కాలంలో విదేశాల్లో చదువు కోసం వెళుతున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అయితే చదువు తర్వాత సరైన ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బందిపడుతున్నారు.ఈ నేపథ్యంలో కెనడాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ రెస్టారెంట్లో వెయిటర్, సర్వీస్ స్టాఫ్ ఉద్యోగం కోసం వేలాది మంది విద్యార్థులు క్యూ కట్టారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. కెనడాలో చదువుకోవాలని లేదా పనిచేయాలని ఆలోచిస్తున్న వారిని ఇది భయాందోళనకు గురిచేస్తోంది!
కెనడా బ్రాంప్టన్‌లోని తందూరీ ఫ్లేమ్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. క్యూలో వేచి ఉన్న విద్యార్థుల్లో ఒకరైన అగమ్వీర్ సింగ్ తన నిరాశను వ్యక్తం చేశాడు. "నేను మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడకు వచ్చాను. లైన్ చాలా పెద్దగా ఉంది. అప్లికేషన్ని ఇంటర్నెట్లో పెట్టాము. ఇంటర్వ్యూ తీసుకుంటామని చెప్పారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలకు అవకాశం ఉందని నేను నమ్మడం లేదు. ఇది చాలా కష్టం," అని అన్నాడు."ఇది చాలా తీవ్రమైన విషం; ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం చూస్తున్నారు. ఎవరికీ సరైన ఉద్యోగం లభించడం లేదు. నా స్నేహితుల్లో చాలా మందికి ప్రస్తుతం ఉద్యోగం లేదు. వారు 2-3 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు," అని క్యూలో నిలపడిన మరొక వ్యక్తి చెప్పుకొచ్చాడు.కెనడాకు వెళ్లిన తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారిలో చాలా మంది పరిస్థితి ఈ విధంగానే ఉంది.