చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు అనుకుంటున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి చందాలపైనే ఆధారపడ్డారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి చందాలు.. అన్నా క్యాంటీన్‌లకు చందాలు.. చివరికి వరదల్లో కూడా చందాలే అంటూ ఆయన ఎద్దేవా చేశారు. విజయవాడ వరదలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. వరదల్లో కేవలం ఆకలితో అలమటించి 30 మందిపైగా మరణించారన్నారు.
రాష్ట్రమంతటా కూడా చిన్నపిల్లలను కూడా వదలకుండా వందల కోట్లు చందాలు వసూలు చేశారు. చందాలు, కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ‘‘వరద బాధితుల సాయంలో కూడా పెద్ద ఎత్తున దోచుకొంటున్నారు. మా ప్రభుత్వం హాయాంలో టీడీపీ వాళ్లు బాదుడే బాదుడు అంటూ ఇళ్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు కూటమి సర్కార్ సామాన్యుడు నడ్డి విరిగేలా నిత్యావసరాల ధరలు పెంచటాన్ని ఏమనాలి?. చంద్రబాబుది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ బాదుడు అనుకుంటున్నారు. కూరగాయలు ఆకాశాన్నంటాయి. గత ప్రభుత్వంలో ఏమైనా ధరలు పెరిగితే రైతు బజార్లు ద్వారా సబ్సిడీకి అందించేవాళ్లం. గతంలో మేము ఇసుకను ప్రభుత్వానికి ఆదాయం కల్పించి సామాన్యులు కొనేలా అందించాం.. కానీ ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపారు’’ అని కారుమూరి వెంకట నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.