ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపట్నానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. విశాఖలో లులు మాల్, మల్టీప్లెక్స్ ఏర్పాటు చేస్తామని లులు గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. అటు టీసీఎస్ సైతం విశాఖపట్నానికి తరలిరానున్నట్లు ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల వెల్లడించారు. ఇప్పుడు విశాఖను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా అణుశక్తితో దాడి చేయగలిగే రెండు జలాంతర్గాములను దేశీయంగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుతో పాటుగా 31 ఆయుధాలతో కూడిన MQ-9B ప్రిడేటర్ డ్రోన్‌లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది.
చైనా దూకుడు కళ్లెం వేయడానికి న్యూక్లియర్ పవర్‌డ్ అటాక్ సబ్ మెరైన్లు ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వీటిని దేశీయంగా తయారు చేయాలని భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టుకు.. ప్రాజెక్ట్ -77గా నామకరణం చేశారు. రూ.40000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. అయితే సుధీర్ఘకాలంగా దీనికి ఆమోదం లభించలేదు. అయితే ఇటీవల జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఆమోదం లభించింది. ప్రాజెక్ట్ -77లో భాగంగా అణుశక్తితో దాడి చేయగలిగే రెండు జలాంతర్గాములను అభివృద్ధి చేయనున్నారు. నౌకాదళ పరిభాషలో వీటిని SSN అని పిలుస్తారు. ఇక ఇందులో క్షిపణులు, టార్పెడోలు, ఇతరత్రా ఆయుధాలు కూడా ఉంటాయి.
అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ రూ.40000 కోట్ల ప్రాజెక్టుకు కేంద్రం విశాఖపట్నాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో ఈ జలాంతర్గాములను తయారు చేయనున్నట్లు సమాచారం. అయితే మొదటి జలాంతర్గామిని తయారు చేయడానికే 10 నుంచి 12 ఏళ్లు పడుతుందని అంచనా. రెండు SSNలు 95 శాతం దేశీయంగా తయారుకానున్నట్లు సమాచారం. కొన్ని డిజైన్ కన్సల్టెన్సీ కోసం మాత్రమే విదేశీ సహాయం తీసుకుంటామని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. స్థానికంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపయోగం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.