గతేడాది వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ను దుబాయ్‌లో అరెస్ట్ చేశారు. అతడ్ని త్వరలో భారత్‌కు తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థన మేరకు నిందితులపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. కుంభకోణంలో మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను గత డిసెంబరులోనే దుబాయ్‌లో అదుపులో తీసుకున్నారు. మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ గేమింగ్, బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తులో చంద్రకర్, రవితో చత్తీస్‌గఢ్‌కు చెందిన వివిధ ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు సంబంధం ఉన్నట్టు బయటపడిందని ఈడీ ఆరోపించింది.
కాగా ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లుగా అధికారులు పేర్కొన్నారు. గతేడాది ఛత్తీస్‌గడ్ ఎన్నికల సమయంలో ఈ కేసు వెలుగులోకి రాగా.. అప్పటి ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు వందల కోట్లు వచ్చాయని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఓ విధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజారడానికి ఈ ఆరోపణలు కూడా కారణం.
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందదిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్‌లు.. దుబాయ్ కేంద్రంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ను నడిపారు. దుబాయ్ వెళ్లడానికి ముందు సౌరభ్ తన సొంతూరులో ఓ జ్యూస్ షాపు నడపడడం గమనార్హం. 2019లో అతడు ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత రవితో కలిసి మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ను ప్రారంభించి.. మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈ, భారత్‌లో పలు అనుబంధ యాప్‌ల ద్వారా కాల్ సెంటర్లు తెరిచారు. ఛత్తీస్‌గఢ్ సహా దేశంలో మొత్తం 30 కాల్ సెంటర్లను తన సన్నిహితులు సునీల్ దామనీ, అనిల్ దామనీ అనే ఇద్దరు వ్యక్తుల ద్వారా నడిపారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో దాదాపు 4 వేల ప్యానెల్ ఆపరేటర్ల ద్వారా దందా సాగించారని ఈడీ పేర్కొంది. వీటి ద్వారా రోజుకు రూ.200 కోట్ల చొప్పున లావాదేవీలు సాగించి.. దుబాయ్‌లో నేర సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. బెట్టింగ్ ఇతర యాప్‌ల ద్వారా వేల కోట్లు కుంభకోణానికి పాల్పడినట్టు ఈడీ గుర్తించింది. గతేడాది ఫిబ్రవరిలో సౌరభ్ చంద్రకర్ వివాహం యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరుకాగా.. వారికోసం ఓ ప్రైవేటు జెట్‌ను సైతం ఏర్పాటుచేసినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
తన వివాహ వేడుక కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా మార్గంలో చెల్లించారని, ఒక్క హోటల్ గదుల కోసమే రూ.42 కోట్లు వెచ్చించినట్లు ఈడీ తెలిసింది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్, తీన్ పత్తీ వంటి ఆటల్లో బెట్టింగ్/ గ్యాంబ్లింగ్ నిర్వహించారు.