ఉచితంగా ఇసుక పేరుతో అందినకాడికి దండుకోవడానికి అధికార పార్టీ ముసుగు తీయనుంది. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయే పరిస్థితి ఉండడంతో కొరత రాకుండా ఉండేందుకు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం స్టాక్ పాయింట్లలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వ చేసింది. ఇప్పుడు ఆ ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఆ ముసుగులో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత ఏర్పడిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట. ఇసుక దోపిడీ వ్యవహారంలో చంద్రబాబు మోడస్ ఆపరండీ కూడా అలాగే ఉంది . గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అబద్ధాలు చెప్పి, ఇప్పుడు ఇసుక వ్యవహారంలో చంద్రబాబు చేస్తున్నదేంటి? అందుకే చంద్రబాబునే అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా? లభిస్తే ఎక్కడో చెప్పగలరా? మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అసలు ఇసుక కొందామంటేనే మా ప్రభుత్వంలోకన్నా రేటు రెండింతలు ఉంది. ఎన్నికల్లో ఉచితంగా ఇసుకను ఇస్తామంటూ ఊరూరా డప్పువేసిన విషయాన్ని మరిచిపోయారా? ఇది ప్రజలను పచ్చిగా మోసం చేయడం కాదా? అధికార దుర్వినియోగంతో ఇసుకచుట్టూ ఒక మాఫియాను మీరు ఏర్పాటు చేయలేదా? భరించలేని రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారా? లేదా? ఎన్నికల ఫలితాలు వచ్చిన తొలి క్షణంలోనే టీడీపీ, కూటమి పార్టీలకు చెందిన నేతల చూపులు ఇసుక నిల్వలపై పడ్డాయన్నది నిజం కాదా? వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం స్టాక్‌యార్డుల్లో ఉంచిన సుమారు 80 లక్షల టన్నుల్లో సగం ఇసుక మీ ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవకముందే ఎక్కడకు పోయింది? ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచే టీడీపీ, ఆ కూటమికి చెందిన పార్టీలనేతలు దోచేయలేదా? కొండల్లా ఉండే ఇసుక నిల్వలు కొన్నిరోజుల వ్యవధిలోనే మాయం అయిపోయాయన్నది నిజంకాదా? అని ప్రశ్నించారు.