ప్రజాప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన, రాజకీయాలు వేర్వేరుగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రూపురేఖలను మార్చనుంది. ఈ పండుగను కృష్ణాజిల్లా కంకిపాడు నుంచే ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ– పంచాయతీ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం అనంతరం పవన్ మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉండగా ఎప్పుడైనా ప్రజా సమస్యలను పరిష్కరించారా అని ప్రశ్నించారు.
"వైసీపీ హయాంలో151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వారెప్పుడైనా ప్రజల సమస్యలపై ఇలా స్పందించారా? ఎంతసేపు వారి నోటి వెంట బూతులు, తిట్లు తప్ప, ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి కానరాలేదు"అని పవన్ విమర్శించారు. "ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధులు చెల్లింపుపై డిస్ ప్లే బోర్టులు ఏర్పాటు చేశాం. మేము పారదర్శకంగా ఉన్నప్పటికీ.. అధికారులు కూడా బాగా పని చేయాలి. ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి నా పేరు చెప్పి డబ్బులు అడగినట్లు తెలిసింది. నా దృష్టికి రాగానే విచారణ చేసి, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అవినీతి అధికారులు మాకు వద్దు. ఎవరు లంచం పేరుతో ఇబ్బంది పెట్టినా మా దృష్టికి తీసుకురండి. మేము ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం.. అభివృద్ధి చేయడం మా బాధ్యత. కంకిపాడులో కూడా డిస్ ప్లే బోర్డులు ఉంటాయి. ప్రజలందరు వివరాలు తెలుసుకోవచ్చు. దేశ చరిత్రలో గ్రామ సభలు, అభివృద్ధి పనులు ఒకేసారి జరగడం ఏపీలోనే చూస్తున్నాం. అన్ని గ్రామ పంచాయతీ వారోత్సవాలలో పనులు ఇవాళ ప్రారంభం అయ్యాయి. పనులు పూర్తి కావాలంటే.. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి. పరిపాలన ఎలా చేయాలనే అంశంలో నాకు సీఎం చంద్రబాబునాయుడు స్పూర్తి. క్యాబినెట్ సమావేశాల్లో చంద్రబాబు బలంగా మాట్లాడతారు. అధికారులు లేవనెత్తే సందేహాలకు కూడా బాబు చెప్పే సమాధానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. పంచాయతీరాజ్ శాఖలో 30 వేల పనులు చేయాలంటే ఎన్నో శాఖల సహకారం, సమన్వయం తప్పని సరి. ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తులకు చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది. అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాలను చేరుకున్నందుకు అభినందనలు. జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర అభివృద్దిలో కీలకమైనది. ఏటా రూ.10వేల కోట్ల నిధులు జాతీయ ఉపాధి హామీ పథకం కింద వస్తాయి. మీ ప్రాంత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఎలా పని చేస్తారో మీ అందరికీ తెలుసు. కంకిపాడు నుంచి రొయ్యూరు వరకు ఉన్న రోడ్డును సుందరీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నా. ఎదురుమొండి నుంచి గొల్లమంద వరకు బ్రహ్మయ్యగారిలంక గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఉందని చెప్పారు. కలెక్టర్ బాలాజీ సహా ఎమ్మెల్యేలు ఈ సమస్యను నా దృష్టికి తీసుకు వచ్చారు. లంక గ్రామాలలో ఉన్న కనెక్టివిటీ రోడ్లు వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నా" అని పవన్ అన్నారు. "వైసీపీ హయాంలో బూతులు తప్ప ఏమీ కనిపించలేదు. కూటమి ప్రభుత్వంలో ప్రజల సమస్యలే అజెండాగా ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. ఊరి అభివృద్ధి కోసం జరుపుకుంటున్న పల్లె పండుగతో గ్రామాల్లో అభివృద్ధి చూస్తాం. వంద రోజుల ఉపాధి హామీ పథకంతో ఆర్ధికంగా ఎదగాలి. ఆగస్టు 23న ఆమోదించిన అన్ని పనులకు కలెక్టర్లు అనుమతులు ఇచ్చారు. ఇవాళ పండుగ వాతావరణంలో భూమి పూజ చేసుకున్నాం. సంక్రాంతి నాటికి పనులన్నీ పూర్తి చేసి, మరోసారి పల్లెల్లో పండుగ చేసుకుందాం" అని పవన్ చెప్పారు.