విజయదశమి రోజున నిర్వహించే అశ్వాల పార్వేటలో యామన్ననగిరి రాజులు విజయం సాధించారు. మద్దికెరలో పెద్దనగిరి, చిన్ననగరి, యామన్న నగరి, యాదవరాజ వంశీకులు ఆదివారం అశ్వాల పార్వేటలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న దసరా ఉత్సవాల్లో వారు పాల్గొన్నారు. అశ్వాలను ఉదయం గ్రామ శివారులోని భోజప్పబావికి తీసుకెళ్లి శుభ్రం చేసి తీసుకువచ్చారు. సాయంత్రం పెద్దనగరి, చిన్ననగరి, యామన్ననగరి యాదవరాజులు రాజుల దుస్తులతో తలకు తలపాగా, చేతికి ఖడ్గం ధరించి అశ్వాలు, సైన్యంతో మేళతాళాలతో బయలుదేరారు.
మద్దికెరకు మజరా గ్రామమైన బొజ్జనాయునిపేటలో యాదవరాజులు నిర్మించుకున్న భోగేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లి ఈ మూడు కుటుంబాల వారు ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 4 కి.మీలు అశ్వాల పార్వేట పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో యామన్ననగరికి చెందిన జగదిల్‌రాయుడు మొదటి స్థానంలో నిలిచారు. ద్వితీయ స్థానంలో పెద్దనగరి, తృతీయ స్థానంలో చిన్ననగిరికి చెందినవారు నిలిచారు. తరతరాలుగా వస్తున్న అశ్వాల పార్వేటను గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి కూడ వచ్చి ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గెలుపొందిన అశ్వంపై రాజులను మెయిన్‌బజారులో ఊరేగించారు.