చేప పిల్లల కోసం స్వదేశీ మత్స్యకారులు ఎదురుచూస్తున్నారు. అక్టోబరు రెండో వారం అయినా ఇంతవరకు వారికి అందించలేదు. టెండర్ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడంతో అసలు చేప పిల్లలను పంపిణీ చేస్తారో? లేదో తెలియని పరిస్థితి నెలకొంది. మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలో మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో టెక్కలి, సంతబొమ్మాళి, ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, కవిటి, సారవకోట, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, బూర్జ, ఆమదాలవలస, గార తదితర మండలాల్లో సుమారు 20వేల స్వదేశీ మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. చేపల పెంపకంపై వీరంతా ఆధారపడి బతుకుతున్నారు. వీరికి ఏటా ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద అధికారులు చేప పిల్లలను పంపిణీ చేయాల్సి ఉంది.
గత ఏడాది ఒక చేపపిల్లను రూ.1.80 చొప్పున కొనుగోలు చేసి 40శాతం సబ్సిడీపై మత్స్యకారులకు పంపిణీ చేశారు. శ్రీకాకుళంలోని చేప పిల్లల ప్రొడక్షన్ యూనిట్, ఇచ్ఛాపురంలోని రేరింగ్ హేచరీ నుంచి కొంతవరకు సరఫరా చేశారు. జిల్లాలో సుమారు 180వరకు ట్యాంకులు ఉండగా వందకుపైగా ట్యాంకులకు అధికారులు కట్ల, రాహు, మృగాల రకాల పిల్లలను అందించారు. ఇవి చాలకపోవడంతో మత్స్యకారులు సొంతంగా ఏలూరు, కైకలూరు, భీమవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బెంగాళ్, ఒడిశా ప్రాంతాల్లో చేప పిల్లలను కొనుగోలు చేసి మిగిలిన చెరువుల్లో పెంచారు. కానీ, ఈ ఏడాది ఇంతవరకు అధికారులు చేప పిల్లలను అందించలేదు. దీంతో స్వదేశీ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చేపపిల్లలను పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా.. ‘ఈ ఏడాది వర్షాలు తక్కువ కారణంగా ఆగస్టు రెండో వారంలో చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభమైంది. ఫింగర్ లింగ్స్ స్థాయి (75 రోజులు)కి వచ్చిన తరువాత వాటిని 40 శాతం వరకు మా పరిధిలో ఉన్న చెరువులకు అందజేస్తాం. ఇప్పటికే ఈ విషయాన్ని కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. మత్స్యకారులు 60శాతం చేపపిల్లలను చెరువుల్లో వేశారు’ అని తెలిపారు.