రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో గురువారం ఉదయం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లాల అధికారులు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు, చెరువులు, వాగుల పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రవాహాలు, నీటి నిర్వహణ చర్యలను ఇరిగేషన్ అధికారులు వివరించారు.
ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉంటాయనే హెచ్చరిక నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లు, అధికారులకు సూచించారు.కాగా నెల్లూరు జిల్లా, ఉదయగిరి నియోజకవర్గంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరికుంటపాడు మండలం, కనియంపాడులో పిల్లాపేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కొండాపురం మండలం, సత్యవోలు అగ్రారం మిడత వాగులో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.