బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చిత్తూరు జిల్లాలో మూడురోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజల కోసం ముందస్తుగా అధికారులు 208 పునరావాసకేంద్రాలు ఏర్పాటు చేశారు. వాకాడు, చిల్లకూరు, కోట, తడ, గూడూరు, బీఎన్‌కండ్రిగ, డక్కిలి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇక సముద్ర తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, వాకాడు, కోట, తడ, సూళ్లూరుపేటలో భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధమైంది.
వాకాడు మండలం తూపిలిపాళెం ఎస్టీకాలనీ వాసులను ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు. మిగతా మండలాల్లోని ప్రజలను రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను గూడూరు ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూముకు (ఫోను నెంబరు: 0877-2236007) లేదా ఆయా రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోని కంట్రోల్‌రూమ్‌లకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.