ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల ... చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 వ రోజు గురువారం చిన వెంకన్న మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరగనుంది. అనంతరం వెండి గరుడవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. కాగా ద్వారకా తిరుమలలో ఏడాదిలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఒకసారి వైశాఖమాసంలో, మరోసారి అశ్వయుజ మాసంలో స్వామివారికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ బ్రహ్మోత్సవాలను ఎనిమిది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.
18న (శుక్రవారం) ద్వారకా తిరుమలలోని మాఢ వీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు జరిగే 8 రోజులపాటు వివిధ వాహనాలపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఎనిమిది రోజులపాటు ద్వారకా తిరుమలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. చిన వెంకన్నను దర్శించుకుంటారు. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా.. నిత్యార్జిత కళ్యాణాలు, సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. ఉత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు.. నాలుగు రాజగోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీహరి కళాతోరణంలో భక్తుల కోసం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
భద్రత పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్నిరకాల చర్యలు చేపట్టారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాగా18వ తేదీ రాత్రి ఏడు గంటలకు స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. శనివారం (19వ తేదీ) ఉదయం ఏడు గంటలకు చక్రస్నానం, రాత్రి ఏడు గంటలకు శ్రీవారి ధ్వజావరోహణ కార్యక్రమాలు జరుగుతాయి. సోమవారం (20వ తేదీ) ఉదయం తొమ్మిది గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపు సేవ, శ్రీపుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.