వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి, హేయమైన భాషలో సోషల్ మీడియాలో చెలరేగిన బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్‌కు బంధువునని చెప్పుకొంటూ ఆయనపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే సోషల్ మీడియాలో అనిల్ చెలరేగిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అనిల్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం హైదరాబాద్, బెంగుళూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇంతలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పసిగట్టిన అనిల్.. ఇక, తాను సేఫ్ అనుకున్నారు. ఈ క్రమంలో గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న తన ఇంటికి ఇటీవల వచ్చేశారు. దీంతో పట్టాభిపురం పోలీసులు బుధవారం ఆయనను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ తర్వాత కౌంటింగ్‌కు ముందు అనిల్ సోషల్ మీడియాలో చేసిన దూషణ లు, బెదిరింపులపై జూన్ 1న నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.