ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్జీ వాసుదేవ్ కు భారీ ఊరట లభించింది. సద్గురుకు చెందిన ఈషా ఫౌండేషన్ పై నమోదైన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది.తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్‌వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ జరిపింది.విచారణ సందర్భంగా ఆ ఇద్దరు మహిళలు ఈషా కేంద్రంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు తెలిపారు. ఈ మేరకు వివరాలు సమర్పించారు. పోలీసులు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం.. ఈ కేసును కొట్టేస్తూ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
కోయంబత్తూరులోని తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ ఆ కేసు ఫైల్ చేశారు. 42, 39 ఏళ్లు ఉన్న ఇద్దరు కూతుర్లను సద్గురు బ్రెయిన్‌వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఆరోపించారు. ఈ మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవలే ఈ కేసుపై మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఇద్దరు మహిళలు కోర్టుకు హాజరయ్యారు. తమ ఇష్ట ప్రకారమే ఈషా ఫౌండేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు. తమను ఎవరూ బంధించలేదని స్పష్టం చేశారు.దీంతో ఈషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని కేసుల జాబితాను తయారు చేసి, నివేదికను సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఫౌండేషన్‌పై అనేక క్రిమినల్ ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్న మద్రాస్ హైకోర్టు.. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని సూచించారు. సద్గురు తన కుమార్తెకు వివాహం జరిపించి సంపన్నమైన జీవితాన్ని ప్రసాదించారని, ఇతర స్త్రీలను సన్యాసం తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాడని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు హైకోర్టు ఈషా ఫౌండేషన్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు దాదాపు 150 మంది పోలీసులు ఈషా ఫౌండేషన్‌లో తనిఖీలు చేశారు.
ఇక ఈ వ్యవహారంపై ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీంతో ఈ కేసు మద్రాసు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై ఇటీవలే విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మహిళల వాంగ్మూలాన్ని బట్టి వారు స్వచ్ఛందంగా ఆశ్రమంలో ఉండటంపై ఎలాంటి సందేహాలకు తావులేదని పేర్కొంది. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టేటస్ రిపోర్టును అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేయాలని తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది.