రాష్ట్రంలో రైతన్నలకు సంవత్సరానికి రూ.20వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని ఎన్డీయే కూటమి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ‘సూపర్ సిక్స్’లో దీనిని ప్రముఖంగా ప్రస్తావించింది. ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కింద వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో రైతులకు సహాయం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం గత వంద రోజులుగా ’అన్నదాత-సుఖీభవ’ పథకం అమలుకు విధివిధానాల రూపకల్పనకు కసరత్తు చేస్తోంది. ‘రైతు భరోసా’లో ఉన్న లోపాలను పరిహరించి, వాస్తవ సాగుదారులను పరిగణనలోకి తీసుకుని, అటు భూ యజమానులకు, ఇటు కౌలు రైతులకు ఆసరా ఇచ్చేలా, ముఖ్యంగా సన్నచిన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందేలా పథకం రూప కల్పన జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు కలిపి, మొత్తంగా ఏటా రూ.20వేలు ఇవ్వనున్నారు. పకడ్బందీగా విధివిధానాలు రూపొందించి... మార్చి, ఏప్రిల్ నెలల్లో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.