ఎన్డీయే సర్కారు అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్కిల్ ఇండియా కార్యక్రమాలు దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వికాసంతోపాటు... భారత శక్తిని చాటి చెబుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’కు ప్రధాని మోదీని ‘కెప్టెన్’గా అభివర్ణించారు. ‘‘మోదీ ఒక కెప్టెన్‌గా తన ఆలోచనలతో వికసిత్ భారత్ 2047 కోసం అడుగులు వేస్తున్నారు. ఆయనకు అండగా నిలుద్దాం. అంతా కలిసి భారతదేశాన్ని మరింత వికసిత్ భారత్‌గా మార్చుదాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం చండీగఢ్‌లో నిర్వహించిన ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
ఈభేటీలో ప్రధానంగా ‘వికసిత్ భారత్’పై చర్చించారు. పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పన, తక్కువ వ్యయంతో విద్యుదుత్పత్తి, నదుల అనుసంధానం, నైపుణ్యం పెంపు తదితర అంశాలపై చంద్రబాబు తన ఆలోచనలను పంచుకున్నారు. ‘‘గతిశక్తి, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలాంటి కార్యక్రమాల ద్వారా దేశం గణనీయమైన పురోగతి సాధించింది. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రజలకు ఎంతో చేరువయ్యాయి. ‘జామ్’ (జన్‌ధన్, ఆధార్, మొబైల్)కు నైపుణ్యాన్ని (స్కిల్) కూడా జోడించి జామ్స్‌గా మార్చాలి. దీనిద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తొలుత పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టాలని... రెండో దశలో అసమానతల తగ్గింపుకోసం ప్రయత్నం చేయాలని సూచించారు. ఆర్థికంగా అగ్రభాగంలో ఉన్న 10 శాతం మంది .. అట్టడుగున ఉన్న 20 శాతం జనాభాకు చేయూతనిచ్చేందుకు ముందుకు రావాలన్నారు. ఈ విధానం ద్వారా పేదరిక నిర్మూలన జరుగుతుందని అభిప్రాయపడ్డారు.