డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2015లో గురుగ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసుపై పంజాబ్- హర్యానా హైకోర్టు ఇచ్చిన స్టేను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు తొలగించింది. దీంతో ఈ కేసు తిరిగి విచారణకు రానుంది. సుప్రీంకోర్టు 'స్టే' ఎత్తివేడంతో పాటు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని డేరాబాబాను ఆదేశించింది. బర్గారీలో గురుగ్రంథ సాహెబ్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలను డేరా బాబా ఎదుర్కొంటున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు కాగా, విచారణపై హైకోర్టు గత మార్చిలో స్టే ఇచ్చింది. దీనిని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. డేరాబాబాకు ఇప్పటికే హత్యాచారం, హత్య కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష పడంది. హర్యానాలోని రోహ్‌తక్ సునారియా జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు.