మైసూర్ అర్బన్ డవలప్‌మెంట్ ఆథారిటీ కుంభకోణంలో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మైసూరులోని ముడా కార్యాలయంలో ఈడీ అధికారులు శుక్రవారంనాడు సోదాలు చేపట్టారు. హుడా భూముల కేటాయింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యులు, పలువురు అధికారుల ప్రమేయంపై ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముడా కమిషనర్ రఘనందన్ సహా పలువురు అధికారులను దర్యాప్తు బృందం కలిసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సెంట్రల్ పారామిలటరీ పోలీసుల భద్రతతో ఈడీ అధికారులు ముడా కార్యాలయంతో పాటు మైసూరులోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
అయితే మఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లలో కానీ, వారి సంబంధీకుల ఇళ్లలో కానీ సోదాలు జరపలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రెండ్రోజుల క్రితం ముడా అథారిటీ చైర్మన్ కె.మరిగౌడ తన ఉద్యోగానికి రాజీనామా చేయడం సంచలనమైంది. సిద్ధరామయ్యకు ఆయన సన్నిహితుడనే పేరుంది. అనారోగ్యం కారణంగానే మరిగౌడ రాజీనామా చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.