ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
సత్యేంద్ర జైన్‌కు బెయిలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించిన సమయంలో కోర్టులోనే ఉన్న ఆయన భార్య భావోద్వానికి గురై కంటతడి పెట్టారు. ''విచారణలో జరుగుతున్న జాప్యం, 18 నెలల పాటు నిర్బంధంలోనే ఉంచడం వల్ల నిందితుడికి ఉపశమనం కలిగించడమే సబబని కోర్టు భావిస్తోంది'' అని ప్రత్యేక న్యాయమూర్తి విషాల్ గాగ్నే తీర్పునిచ్చారు. సత్యేంద్ర జైన్‌కు కోర్టు బెయిలు మంజూరు చేస్తూ, సాక్ష్యులను కలవడం కానీ, విచారణను ప్రభావితం చేయడం కానీ, దేశం విడిచిపెట్టి వెళ్లడం కానీ చేయరాదని షరతులు విధించింది. తనకు సంబంధం ఉన్న నాలుగు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు సత్యేంద్ర జైన్ పాల్పడ్డారంటూ 2022 మే 30న ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.