హర్యానా ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన నయాబ్ సింగ్ సైనీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్యానా ప్రజలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఉచిత డయాలసిస్ పథకాన్ని సీఎం సైనీ ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని మెడికల్ కాలేజీల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం కూడా కల్పిస్తామని మరో హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆయన రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నెరవేర్చారు. హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. కిడ్నీతో బాధపడుతున్న వారు డయాలసిస్ చేయించుకోవడానికి ప్రతి నెలా వేల రూపాయిలు ఖర్చు చేయాల్సి వస్తుంది. హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలమంది పేద ప్రజలకు లబ్ధిచేకూరనుంది.