ఇజ్రాయేల్ దాడులతో హమాస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాజాలో గతవారం ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో హమాస్ అధినేత, గత అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి యాహ్యా సిన్వార్ హతమయ్యారు. ఆ రోజున జరిగిన దాడుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో సిన్వార్ ఒకరని ఇజ్రాయేల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, చనిపోయే ముందు సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కదలికలను ఇజ్రాయేల్ డ్రోన్ కెమెరా రికార్డు చేసింది. ఈ వీడియోను ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ విడుదల చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
శిథిలమైన ఓ భవనంలోని సోఫాలో సిన్వార్ కూర్చుని ఉండగా.. డ్రోన్ వీడియో చిత్రీకరించింది. దాన్ని గమనించిన అతడు ఓ కర్రలాంటి వస్తువును దానిపైకి విసిరినట్లుగా వీడియోలో రికార్డయ్యింది. ఇజ్రాయేల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగారీ దీనిపై మాట్లాడుతూ.. ‘దాడి తర్వాత శిథిలమైన భవనం లోపల హమాస్ మిలిటెంట్లు ఎవరైనా ఉన్నారా? అనేది తెలుసుకునేందుకు డ్రోన్‌ను పంపించాం.. తొలుత ఆ వ్యక్తిని మేము యహ్వా సిన్వార్ అనుకోలేదు.. కేవలం ఓ మిలిటెంట్‌గానే భావించాం.. ఆ తర్వాత భవనంపై మరోసారి బాంబు దాడి చేశాం.. దీంతో అది కుప్పకూలి అతడు మరణించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాతే అతడు సిన్వార్ అని గుర్తించాం. అతడి శరీరంపై బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్, గ్రనేడ్లు ఉన్నాయి’ అని వెల్లడించారు.
‘ఇజ్రాయేల్ చరిత్రలో అత్యంత దారుణమైన దాడులకు సిన్వార్ సూత్రధారి.. గాజా నుంచి ఇజ్రాయేల్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు మా పౌరులను ఊచకోత కోశారు.. మా మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు.. కుటుంబాలకు కుటుంబాలను సజీవదహనం చేశారు... చిన్నారులు, మహిళల సహా 250 మందిని గాజాలో బందీలుగా చేసుకున్నారు.. ఏడాదికిపైగా 101 మంది వారి వద్ద బందీలుగా ఉన్నారు’ అని హగారీ పేర్కొన్నారు. ఈ దాడి నుంచి తప్పించుకోడానికి సిన్వార్ ప్రయత్నించాడు కానీ, మా సైన్యం అతడికి అవకాశం ఇవ్వలేదని అన్నారు.
గాజాలోని పౌరులను ముందుపెట్టుకుని ఇజ్రాయేల్‌తో హమాస్ యుద్దం చేస్తోందని మండిపడ్డారు. అయితే, తమ యుద్దం హమాస్‌తో మాత్రమేనని, గాజా పౌరులతో కాదని స్పష్టం ఆయన పునరుద్ఘాటించారు. ‘ఆహారం, తాగునీరు, ఔషధాలు సహా గాజాలో మానవతా సాయం పెంచడానికి కృషి చేస్తున్నాం.. అక్కడ ప్రజలు ఇబ్బందులు పడటానికి కారణం యహ్వా సిన్వార్’ అని హగారీ పేర్కొన్నారు.
దక్షిణ గాజాలో గత బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయేల్ సైన్యం మట్టుబెట్టింది. ఇందులో ఒకరికి సిన్వార్ పోలికలు ఉన్నాయని గుర్తించి... అతని డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. గతంలో అతడు ఇజ్రాయేల్ జైల్లో ఉన్నప్పుడు సేకరించిన డీఎన్ఏ నమూనాలతో వాటిని పరీక్షించి.. అతడి మరణాన్ని ధ్రువీకరించుకుంది. అయితే, అతడి మృతి గురించి హమాస్ సంస్థ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.