ఒంగోలును చెడ్డీ గ్యాంగ్ భయపెడుతోంది. నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ దిగిందనే అనుమానాలతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తు్న్నాయి. ముఖ్యంగా రామ్‌నగర్‌లోని నర్సింగ్ కాలేజిలో రూ.50 వేలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి చొరబడిన దొంగలు.. అందులోని 50 వేల రూపాయలు ఎత్తుకెళ్లారు. అయితే ఇది చెడ్డీ గ్యాంగ్ పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు పోలీసులు రెండు రోజుల నుంచి చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. వారి కదలికలను తెలుసుకునే పనిలో పడ్డారు. 35 టీములు, 400 మంది పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కోసం తనిఖీలు, గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందనే అనుమానాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని పోలీసులు అలర్ట్ చేశారు.
మరోవైపు దోపీడీ దొంగల కదలికలపై అనుమానంతో పోలీసులు ఒంగోలు నగరాన్ని జల్లెడ పడుతున్నారు. 400 మంది పోలీసులతో జిల్లాలో నాకాబందీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ కూడా స్వయంగా తనిఖీల్లో పాల్గొన్నారు. అనుమానిత వ్యక్తులను, కొత్త వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులు కనిపిస్తే వివరాలు తెలుసుకోవాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీసులను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో రైల్వే స్టేషన్, బస్టాండ్, గ్రామశివార్లు ఇలా అన్ని చోట్లా పోలీసులు తనిఖీలు చేశారు.
ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కొన్ని ముఠాలు తిరుగుతున్నాయన్న డీఎస్పీ నాగరాజు.. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నట్లు చెప్పారు. ఆలయాలను సైతం లక్ష్యంగా చేసుకుని హుండీ దొంగతనాలను పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ సంచారాన్ని సైతం గుర్తించామన్న డీఎస్పీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మీ ప్రాంతంలో అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే పెళ్లిళ్లు, పండుగల కోసం ఊరికి వెళ్తుంటే.. విలువైన వస్తువులను ఇంట్లో పెట్టుకోవద్దని, సురక్షితమైన ప్రాంతంలో భద్రపరుచుకోవాలని డీఎస్సీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.