ఏపీలో మరోసారి వాన ముప్పు పొంచి ఉందని చెబుతోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో ఈనెల 22నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదంటున్నారు. ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా కదులుతూ.. ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చొని చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు.
ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా స్పష్టత వస్తుందని చెబుతుంది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందిన చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం తిరుపతి, శ్రీసత్యసాయి, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
మరోవైపు ఏపీలోని పలు తీర ప్రాంతాల్లా సముద్రపు నీరు ముందుకు రావడంతో స్థానికులు ఆందోళనలో ఉన్నారు. ఇటీవల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గత మూడు రోజులుగా సముద్ర జలాలు తీరం వైపు కొన్ని మీటర్ల మేర ముందుకు వస్తున్నాయి. దీంతో ఒడ్డున ఉన్న దుకాణాలు, చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు నిర్వహించుకునే ప్రదేశాల వరకు నీరు వస్తోంది. దీంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇదే పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుందోనని.. ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఎదురవుతుందా అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, వ్యాపారులు