ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆన్‌లైన్ విచారణ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి నగ్నంగా కనిపించడం కలకలంరేపింది. ఈ నెల 15న హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో.. ఓ వ్యక్తి మంచంపై నగ్నంగా పడుకుని ఆన్‌లైన్ ద్వారా ప్రత్యక్షం అయ్యాడు. ఈ విషయాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.. అతడి గురించి వెంటనే ఆరా తీశారు. 17వ కోర్టు విచారణలోకి కిట్టు అనే యూజర్ ఐడీతో ఓ వ్యక్తి యాప్ ద్వారా లాగిన్ అయ్యాడు. అతడి ఒంటిపై దుస్తులు లేకుండా మంచంపై పడుకొని మాట్లాడుతూ కనిపించాడు.
హైకోర్టు కోర్టు విచారణకు ఉద్దేశపూర్వకంగా విఘాతం కలిగించాడని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే కోర్టు సిబ్బంది అప్రమత్తం అయ్యారు.. ఆ లాగిన్‌ను బ్లాక్ చేశారు. వెంటనే లాగిన్ వివరాలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఐటీ రిజిస్ట్రార్ ఏడుకొండలు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు.. ప్రజలకు న్యాయాన్ని దగ్గర చేయాలని, లాయర్లు, పిటిషన్‌లు దాఖలు చేసినవారికి విచారణ సమయంలో సౌకర్యంగా ఉండాలని ఆన్‌లైన్ విచారణలకు వెసులుబాటు కల్పించింది. కానీ కొందరు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే హైకోర్టు తీవ్రంగా పరిగణించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడి గురించి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సుప్రీం కోర్టు ఈ ఆన్‌లైన్ విచారణను సరికొత్తగా తీసుకొచ్చింది.. సుప్రీం కోర్టుతో పాటుగా అన్ని రాష్ట్రాల హైకోర్టుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ ఆన్‌లైన్ విచారణ అందుబాటులోకి రావడం ఓ విధంగా శుభపరిణామం అనే చెప్పాలి. లాయర్లు పిటిషనర్ల తరఫున ఆన్‌లైన్ ద్వారా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. అలాగే కరోనా వంటి సమయాల్లో కూడా ఈ ఆన్‌లైన్ విధానంతో ఉపయోగం ఉంటుంది. అలాగే అసలు కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి.. తీర్పులు ఎలా ఉంటాయో కూడా ప్రజలకు తెలుస్తోంది. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలతో.. కోర్టుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి.