తినే ఆహారంలో ఏదైనా మలినం కలిసిందని తెలిస్తేనే.. కడుపులో తిప్పినట్లు అవుతుంది. అలాంటిది రోజూ తినే చపాతీల్లో పనిమనిషి మూత్రం కలుపుతోందని తెలిస్తే.. ఆ చపాతీలు తిన్న వారి పరిస్థితి ఏంటి? ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ కుటుంబం ఇప్పుడు ఇలాంటి మానసిక క్షోభనే అనుభవిస్తోంది. వారి ఇంట్లో 8 ఏళ్లుగా పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ గత కొన్ని రోజులుగా చపాతీలు తయారుచేసే పిండిలో మూత్రం కలుపుతోంది. మూత్రం కలిపిన ఆ పిండి ముద్దతో చపాతీలు చేసి వారికి పెడుతోంది. కుటుంబంలో ఒక్కొక్కరుగా అందరూ కాలేయం సంబంధిత వ్యాధుల బారినపడ్డారు. డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకున్నా.. వారి ఆరోగ్యం మెరుగుపడటంలేదు. పనిమనిషి ఏదైనా విషపదార్థం కలుపుతోందా అని ఇంటి యజమాని భార్యకు అనుమానం వచ్చింది. దీంతో కిచెన్‌లో రహస్యంగా కెమెరా అమర్చారు. ఆ కెమెరాలో రికార్డైన వీడియో చూశాక, వాళ్ల కళ్లు బైర్లు కమ్మాయి. షాక్‌లోకి వెళ్లిపోయారు.
కిచెన్‌లో వంట పాత్రలో మూత్రం చేసి, ఆ మూత్రాన్ని పిండిలో కలిపి చపాతీలు చేస్తోంది పనిమనిషి. ఆ దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో చూసిన వెంటనే.. పోలీసులను ఆశ్రయించారు ఇంటి యజమాని. పోలీసులు వెంటనే ఆ పనిమనిషిని అదుపులోకి తీసుకొని విచారించారు. తొలుత అలాంటిదేమీ లేదని పనిమనిషి బుకాయించింది. వీడియో చూపించి ప్రశ్నించడంతో తన నేరాన్ని అంగీకరించింది. ఇంతకీ అంత దారుణానికి ఎదుకు పాల్పడింది?
ఘజియాబాద్‌లోని రెసిడెన్షియల్ సొసైటీలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త నితిన్ గుప్తా ఇంట్లో గత 8 సంవత్సరాలుగా పనిమనిషిగా చేస్తోంది 32 ఏళ్ల రీనా అనే మహిళ. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఆమెను ఎంతో నమ్మామని, ఇలాంటి పాడుపని చేస్తుందని అస్సలు ఊహించలేదని కుటుంబసభ్యులు వాపోతున్నారు.
తమ ఇంట్లో గతంలో ఒకసారి దొంగతనం జరిగిందని, ఇతరులు ఆరోపణలు చేసినా.. పనిమనిషి రీనాను అనుమానించలేదని నితిత్ గుప్తా భార్య రూపమ్ తెలిపారు. అయితే, తాజా ఘటన తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా కలవరపెట్టిందని ఆమె చెప్పారు. చిన్న చిన్న విషయాలకు కూడా తనను తిడుతుండటంతో ప్రతీకారం తీర్చుకునేందుకే తాను అలా చేసినట్టు పోలీసుల విచారణలో రీనా చెప్పింది. అయితే, అలాంటిదేమీ లేదని నితిన్ గుప్తా చెబుతున్నారు. ఈ ఘటన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? రీనాతో బలవంతంగా ఈ పనిచేయించారా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
‘ఈ ఘటన కలతపెట్టింది. పనిమనిషుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీర్ఘకాలికంగా ఇళ్లలో పనిచేస్తున్న వారితో వ్యవహరించేటప్పుడు కూడా కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదు’ అని ఘజియాబాద్ ఏసీపీ లిపి నాగయాచ్ అన్నారు.