ఇటీవల మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్ట్‌లు మృతి చెందగా.. తాజాగా అందుకు వారు ప్రతీకారం తీర్చుకున్నారు. మావోయిస్ట్‌లు పెట్టిన ఐఈడీ బాంబులు పేలడంతో ఇద్దరు జవాన్లు అమరులు అయ్యారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌ల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టగా.. మందుపాతర పేలి జవాన్లు చనిపోయారు. చనిపోయిన ఇద్దరు జవాన్లలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కాగా.. మరో జవాన్ స్వస్థలం మహారాష్ట్ర అని అధికారులు వెల్లడించారు. గాయపడిన జవాన్లను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ - ఐటీబీపీకి చెందిన జవాన్లు.. శనివారం మధ్యాహ్నం.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ - బీఎస్ఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్‌లు సంయుక్తంగా ధుర్బేదాలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి.. తిరిగి నారాయణ్‌పూర్‌కు వస్తుండగా.. అబుజ్మద్ ప్రాంతంలోని కొడ్లియార్ గ్రామానికి సమీపంలో రోడ్డుపై అమర్చిన ఐఈడీ బాంబులు పేలాయి. ఇందులో ఐటీబీపీకి చెందిన ఇద్దరు జవాన్లు ప్రాణాలు వదిలారు. వీరిద్దరూ ఐటీబీపీ 53వ బెటాలియన్‌కు చెందిన 36 ఏళ్ల జవాన్లు అని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన కే రాజేష్.. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన అమర్ పన్వార్.. ఈ ప్రమాదంలో చనిపోయినట్లు వెల్లడించారు.
ఇక గాయపడిన మరో ఇద్దరు నారాయణ్‌పూర్ డిస్ట్రిక్ట్ పోలీసులు అని గుర్తించారు. వారికి చికిత్స అందుతోందని.. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. అబుజ్మద్ ప్రాంతంలో ఇటీవల 2 వారాల క్రితం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్ట్‌లు మృతి చెందగా.. తాజాగా అదే ప్రాంతంలో జవాన్లే లక్ష్యంగా ఐఈడీ బాంబులు పేలడం సంచలనంగా మారింది. అక్టోబర్ 4వ తేదీన జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్.. 24 ఏళ్ల ఛత్తీస్‌గఢ్ చరిత్రలోనే అతిపెద్దది అని.. ఒకే ఆపరేషన్‌లో అంతమంది చనిపోవడం తొలిసారి కావడం గమనార్హం. ఇక చనిపోయిన 38 మంది మావోయిస్ట్‌లపై మొత్తంగా రూ.2.62 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.