మన దేశంలో అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న ప్రభుత్వ సంస్థ భారతీయ రైల్వేలు. అయితే ప్రస్తుతం రైల్వే శాఖలో సిబ్బంది కొరత అధికంగా ఉండటం, ఇటీవల కొన్ని రైలు ప్రమాదాలు జరగడంతో ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరతను అధిగమించేందుకు దేశంలోని పలు జోన్లలో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 25వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు కూడా అవకాశం కల్పించింది. రైల్వే శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఈ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఆ రిటైర్డ్ ఉద్యోగుల వయసు 65 ఏళ్ల లోపు ఉండాలని నిర్ణయించింది.
ఈ నిర్ణయం ప్రకారం.. సూపర్‌వైజర్ల దగ్గరి నుంచి ట్రాక్‌మెన్ వరకు పలు ఉద్యోగాలకు రైల్వే నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 65 ఏళ్ల లోపు ఉన్న రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకుని.. రెండేళ్ల పాటు వారి సేవలను ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు. కొన్ని సందర్భాల్లో అవసరమైతే వారి పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలున్నాయని వెల్లడించింది. దీనికోసం ఇప్పటికే దేశంలోని అన్ని జోనల్ రైల్వే జనరల్ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసినట్లు రైల్వే శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గత 5 ఏళ్ల మెడికల్ ఫిట్‌నెస్‌తో పాటు, పదవీ విరమణకు ముందు వారి పనితీరును పరిశీలించి.. రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపాయి. గతంలో ఏదైనా సమయంలో విజిలెన్స్, డిపార్ట్‌మెంట్ చర్యలను ఎదుర్కొన్న వారు అనర్హులు అని తేల్చి చెప్పాయి.
అయితే ఈ విధానం ప్రకారం తిరిగి విధుల్లోకి తీసుకున్న రిటైర్డ్ ఉద్యోగులకు.. పదవీ విరమణకు ముందు చివరిసారిగా వారు పొందిన నెలవారీ జీతంలో నుంచి బేసిక్ పింఛన్‌ను తొలగించి వేతనాలు చెల్లించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా వారికి ట్రావెల్ అలెవెన్స్‌లు, అధికారిక టూర్లు సహా పలు ప్రయోజనాలను కల్పించనున్నట్లు వెల్లడించాయి. ఇక వారికి ఇంక్రిమెంట్లు సహా ఇతర ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశాయి. రైల్వే శాఖ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతతో పాటు గత కొన్ని రోజులుగా దేశంలో పెరుగుతున్న రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక్క వాయవ్య రైల్వే జోన్‌లోనే 10వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని సమాచారం. మిగిలిన జోన్లలోనూ భారీగా సిబ్బంది అవసరం ఉందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి.