గడ్డం అనేది అబ్బాయిలకు ఒక హుందాతనాన్ని తీసుకువస్తుంది. ఇక గడ్డం పెరిగిన అబ్బాయిలు.. రకరకాల స్టైల్ షేవింగ్‌లతో మరింత అందంగా కనిపించేందుకు ట్రై చేస్తూ ఉంటారు. ఇక గడ్డం విషయంలో తమ అభిమాన హీరో, సెలబ్రిటీ ఎలాంటి స్టైల్ అనుసరిస్తున్నాడో.. యూత్ కూడా అదే స్టైల్ గడ్డం చేయించుకుంటూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక అబ్బాయిలు సెలూన్‌కు వెళ్లారంటే చాలు.. ఆ స్టైల్, ఈ స్టైల్ అంటూ బార్బర్‌కు ముచ్చెమటలు పట్టిస్తూనే ఉంటారు.
ఇక మరికొందరు అబ్బాయిలు అయితే అమ్మాయిల ముందు హీరో అనిపించుకోవడం కోసం రకరకాల గడ్డం స్టైల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనం నిత్యం చూసే విషయాలే. అయితే ఇక్కడ కొందరు అమ్మాయిలు మాత్రం.. గడ్డం లేని అబ్బాయిలే కావాలి అంటూ రోడ్డెక్కారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. కొందరు యువతులు.. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని.. నినాదాలు చేసుకుంటూ రోడ్డుపై వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తమకు గడ్డంతో ఉన్న అబ్బాయిలు ఏ మాత్రం వద్దని.. క్లీన్ షేవింగ్ చేసుకున్న వారు మాత్రమే కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ యువతులు తమకు గడ్డం ఉన్నట్లు కృత్రిమ గడ్డం పెట్టుకుని నినాదాలు చేస్తూ రోడ్డుపై ర్యాలీ తీశారు. క్లీన్ షేవ్ చేసుకునే అబ్బాయిలు కావాలని నినాదాలు చేస్తున్నారు.
"నో క్లీన్ షేవ్.. నో లవ్.. బియర్డ్ హటావో గర్ల్‌ఫ్రెండ్ భూల్‌జావో" ( గడ్డాన్ని వదులుకో.. లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను వదులుకో).. బియర్డ్ హటావో ప్యార్ బచావో( గడ్డం తీసేయండి.. ప్రేమను కాపాడుకోండి) అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కాలంలో గడ్డం లేని అబ్బాయిలను కూడా అమ్మాయిలు ఇష్టపడుతున్నారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. అయినా ప్రేమించడానికి గడ్డానికి ఏంటి సంబంధం అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గడ్డంతో వచ్చిన సమస్య ఏంటని మరికొంత మంది కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ కావడంతో మరోసారి అబ్బాయిల గడ్డానికి, అమ్మాయిల ప్రేమకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతోంది.